ముక్కు సూటిగా ఉంటూ, గొప్ప నాయకుడు అని పేరు తెచ్చుకొని, ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలని చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలుసు కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. రేవంత్ రెడ్డికి కూడా ఒక ప్రేమ కథ ఉంది. ఆ ప్రేమ కథ కూడా సినిమాని తలపించే లాగానే ఉంది.
రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్న సమయంలో ఏబీవీపీ లీడర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు నిర్వహించేవారు. రేవంత్ రెడ్డి ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లినప్పుడు గీతారెడ్డిని తొలిసారిగా చూశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి మొదట గీతారెడ్డికి ప్రపోజ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా రేవంత్ రెడ్డికి ఓకే చెప్పారట.
గీతారెడ్డి, రేవంత్ రెడ్డి ప్రేమని అంగీకరించిన తర్వాత వారి పెద్దలని ఒప్పించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో గీతారెడ్డి తండ్రి వీరి ప్రేమ విషయం తెలిసిన తర్వాత, వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. గీతారెడ్డిని పై చదువుల కోసం ఆయన సోదరుడు, అప్పటి అయిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి వదల్లేదు. జైపాల్ రెడ్డి తో మాట్లాడి నచ్చచెప్పించే ప్రయత్నం చేశారు.
రేవంత్ రెడ్డి లోని మొండితనం చూసిన జైపాల్ రెడ్డి ఆయనని ఒప్పించారట. ఇదంతా గీతారెడ్డి తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా వీరిద్దరూ పెద్దల సమక్షంలో 1992 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. అంచలంచలుగా పైకి వచ్చిన రేవంత్ రెడ్డి జీవితంలో, ఆయన ప్రతి దశలోను గీతారెడ్డి రేవంత్ రెడ్డికి తోడుగా ఉన్నారు. ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి సహకారం అందించి అండగా నిలిచారు గీతారెడ్డి.