MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?

MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?

MS Dhoni Jersey: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నంబర్ 7.. ఇకపై ఏ భారతీయ క్రికెటర్‌ జెర్సీపైనా కనిపించదు. ఎందుకంటే, దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను గౌరవించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బోర్డు 7వ నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా, ధోనీ మూడేళ్ల క్రితం 2020లో తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందు, ఒక ఆటగాడి జెర్సీకి మాత్రమే రిటైర్మైంట్ ప్రకటించింది. ఆయనెవరో కాదు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 2017 సంవత్సరంలో భారతరత్న సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ప్రకటించింది. ధోనీ, సచిన్‌ల జెర్సీ నంబర్లను ఏ ఆటగాడు ఉపయోగించకూడదని బోర్డు టీమ్ ఇండియా ఆటగాళ్లకు తెలియజేసింది.

2007లో ధోనీ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ధోని నాయకత్వంలో జట్టు మరోసారి 2014లో టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ ఆడింది. కానీ, ట్రోఫీని గెలవలేకపోయింది. 2011లో ధోనీ నాయకత్వంలో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఇప్పుడు ఈ గొప్ప కెప్టెన్ నంబర్-7 జెర్సీని రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎన్డీటీవీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ధోనీ నంబర్-7 జెర్సీని రిటైర్ చేయాలని BCCI నిర్ణయించింది. టీమ్ ఇండియాలో ఉన్నప్పుడు ఆటగాళ్లు నంబర్-7 జెర్సీని ధరించరాదని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత భవిష్యత్ లేదా ప్రస్తుత ఆటగాళ్లెవరూ జెర్సీ నంబర్-7ను ధరించరాదని బీసీసీఐ చెప్పిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసుకొచ్చింది.

ధోనీ జెర్సీ వెనుక ఏడవ నంబర్‌ను ఉపయోగించడంపై విభిన్న కథనాలు వినిపిస్తుంటాయి. అయితే, ఈ విషయాన్ని ధోనీ స్వయంగా వెల్లడించాడు. “ఏడో నంబర్ జెర్సీని ధరించడానికి నా పుట్టినరోజు తప్ప వేరే కారణం లేదు. కాబట్టి నేను జెర్సీ నంబర్ 7 ధరిస్తాను. ఏ నంబర్ బెస్ట్ అని చింతించకుండా, నా పుట్టినరోజు జెర్సీని ధరించడం ప్రారంభించాను” అంటూ ధోని క్లారిటీ ఇచ్చేశాడు.

బీసీసీఐ ఒక ఆటగాడి జెర్సీని రిటైర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది. భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 ధరించేవాడు. బీసీసీఐ అతని జెర్సీని కూడా రిటైర్ చేసింది. శార్దూల్ ఠాకూర్ తన కెరీర్‌లో కొన్ని మ్యాచ్‌లలో 10వ నంబర్ జెర్సీని ధరించాడు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత, 10వ నంబర్ జెర్సీని విరమించుకున్నారు.

Please follow and like us:
క్రీడలు వార్తలు