‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?

‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?

ఊళ్లు, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం

తుదిగా ఆమోద ముద్ర వేయనున్న ఇన్‌చార్జి మంత్రి

నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ!

రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసన సభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. నాలుగు నెలల క్రితం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

వీటిల్లో ఇందిర మ్మ ఇళ్ల కోసం 80 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, వాటిల్లో ప్రాథమిక స్థాయిలో 16 లక్షల దర ఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 64 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. కానీ ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబితా రూపొందించనున్నందున, ఈ దరఖాస్తులతో పాటు కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

ఎమ్మెల్యేలదే హవా..

నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికీ ఏ పథకంలో కూడా ఇళ్లు అందని పేదలనే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల స్క్రూటినీ కీల కంగా మారనుంది. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల్లో చాలావరకు గతంలో ఇళ్లు పొందిన వారికి సంబంధించినవీ ఉన్నాయని సమాచారం. ఆధార్‌ నంబరు, ఇతర వివరాల ఆధారంగా ఇప్పటికే ఆ విధంగా ఇళ్లు పొందినవారి దరఖాస్తులను తొలగించనున్నారు.

అయితే గతంలో ఇల్లు పొందినా, ఆ తర్వాత వారి పిల్లల పెళ్లిళ్లు కావటంతో మరో ఇంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఆ దరఖాస్తు అర్హమై నదే అవుతుంది. దీంతో దరఖాస్తుల్లోని వివరాల పరిశీలనే కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీ లించాల్సి ఉంటుంది. దీనిపై పెద్దయెత్తున కసరత్తు అవసరం కాగా.. లబ్ధిదారుల ఎంపికలో తుది ఆమోదముద్ర జిల్లా ఇన్‌చార్జి మంత్రే వేయను న్నారు.

అంటే ఎమ్మెల్యేలు సిఫారసు చేసే వాటికే ఆమోదముద్ర పడే అవకాశం ఉంటుంది. ఏయే ఊళ్లను ఎంపిక చేయాలి, ఆ ఊళ్లలో ఎవరికి ఇళ్లు మంజూరు చేయాలి అన్న దానిపై ఎమ్మెల్యేల నిర్ణయానికే ప్రాధాన్యం దక్కనుంది. దీంతో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకే వీరు పరిమితం అయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పాత దరఖాస్తులు అలంకారప్రాయమే!

ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవ టం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో చాలా అంశాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి మరీ జాబితాలు రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు అలంకారప్రాయంగానే మిగిలిపోయే పరిస్థితి ఉండనుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు