తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?

తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?

‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టిందన్న అనుమానాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపటం లేదు.

⇒ ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరి­గింది. అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు కూడా నాటి ప్రభు­త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత అది చల్లారిపోయింది.  

⇒గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెరపైకి తెచి్చంది.

⇒అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు.

⇒సెపె్టంబర్‌ మొదటివారంలో బిల్లుపై గవర్నర్‌ ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగు­లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు అయ్యింది.

⇒విధివిధానాలకు ఓ కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది.

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే, ఆ హామీని నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నామన్న ఆవేదన నుంచి ఉపశమనం పొందే ఆ ప్రక్రియను వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలి.

విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధివిధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టవుతుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరికి పీఆర్‌సీ వర్తించదు. విలీనమయితేనే పీఆర్‌సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి,. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబి్ధకి దూరమవుతున్నారు. ఇప్పటికే 1,800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు