రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వస్త్రాల నర్సింహులు అనే వ్యక్తికి కుల్కచర్ల గేటు సమీపంలో ఇల్లు ఉంది. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో ఆ ఇల్లు కాస్తా పోవడంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

అధికారులు 8 నెలల క్రితం కుల్కచర్ల నుండి చౌడాపూర్ వరకు కొత్త రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. రోడ్డు విస్తరణలో భాగంగా కుల్కచర్ల గేటు సమీపంలో కొందరు స్థానికులు తమ ఇళ్లను కోల్పోయారు. ఈ క్రమంలో వస్త్రాల నర్సింహులు (45) అనే వ్యక్తి కూడా తన ఇంటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్థానిక గురుకుల పాఠశాల హాస్టల్లో రోజువారీ కూలీగా పని చేసే నర్సింహులు వేరే ఓ ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. గూడు కోల్పోవడంతో మనస్థాపానికి గురైన నర్సింహులు మద్యానికి అలవాటు పడటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేటప్పుడు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేపట్టడంతో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటిస్థలం కేటాయిస్తానని హామి ఇచ్చారని బాధితులు చెబుతున్నారు.

నెలలు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇంటి ఊసు లేకపోవడం…ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర కలత చెందిన నర్సింహులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. నర్సింహులు మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు విస్తరణ తమ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టుగా తమకు న్యాయం చేయాలని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Please follow and like us:
తెలంగాణ