వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు..

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి. ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాట ఇప్పుడు భారంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న టమాట ధరలు ఇటు ప్రజలతోపాటు అటు రీటైల్‌ మార్కెట్‌ను వణికిస్తోంది.

గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టమాట రూ.100 పలుకుతోంది. నాగర్‌కర్నూల్‌ రైతుబజార్‌లో కిలో టమాట ధర రూ.100కు చేరింది. కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు గతంలో రూ.10కి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు రూ.20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలో రూ.100 దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాట పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటలు దొరక్కపోవడంతో టమాట ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం, పది రోజుల్లో టమాట ధరలు రూ.200 వరకు చేరే అవకాశం ఉంది. టమాటనే కిలో రూ.100 ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలని సామాన్యులు వాపోతున్నారు.

అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కిలో టమాట రూ.80 ఉండగా.. రవాణా ఛార్జీలు కలుపుకుని కొన్ని చోట్ల రూ.100 అమ్ముతున్నారు. స్థానిక మార్కెట్లలో మరో 2 రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోవడంతో 60 శాతం దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె, పలమనేరు నుంచి, కర్ణాటకలోని చింతామణి.. వంటి ఇతర ప్రాంతాల నుంచి టమోటాలు దిగుమతి అవుతున్నాయని హోల్‌సేల్‌ మార్కెట్‌ యార్డు అధికారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు 25 కిలోల టమాటాను రూ.1500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రవాణా, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి రిటైలర్లకు కిలో రూ.75, వినియోగదారులకు రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు