జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఆపై ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..

జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఆపై ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..

శిక్ష సమయంలో జైల్లో సత్ప్రవర్తన కలిగిన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేయనున్నారు చర్లపల్లి జైలు అధికారులు. మొత్తం 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి జీవో నెంబర్ 37 జారీ చేశారు. విడుదలయ్యే వారిలో జీవిత ఖైదీలతో పాటు ఇతర శిక్షపడిన ఖైదీలు ఉన్నట్లు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. చైల్డ్ శాఖ అత్యున్నత స్థాయి కమిటీ మొత్తం 231 మంది ఖైదీలను విడుదలకు సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. దీంతో 213 మంది ఖైదీల విడుదలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదముద్రవేశారు. ముందుగా విడుదల కానున్న ఈ ఖైదీలకు కొన్ని షరతులు విధిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు.

ప్రతి ఖైదీ బయటకు వెళ్ళిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని రూ.50 వేలకు వ్యక్తిగత పూచికత్తుతో బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకూ వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్‎లో ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరు కావలసి ఉంటుందని పేర్కొన్నారు. మళ్ళీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్ష తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీని గమనిస్తూ ఉండడంతో పాటు.. ఆ ఖైదీ విడుదలైన జైలుకు ఆరు నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు త్వరలో 213 మంది ఖైదీలు విడుదలకు జైళ్ల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విడుదల కాబోతున్న 213 మంది ఖైదీలను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తీసుకు వచ్చి అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వృత్తినైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ మొత్తంక అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు