బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు

బ్యాంకాక్‌లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు

ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్‌ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్‌లీ టూర్‌ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఏకంగా బ్యాంకాక్‌ ఎగిరిపోయారు.

శివారు కార్పొరేషన్‌ అయిన పీర్జాదిగూడ మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా ఈ నెల 6న కాంగ్రెస్‌ నేతలు, కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించగా వచ్చే నెల 5న తీర్మానం తేదీని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను టార్గెట్‌ చేస్తూ వారిని వెంబడిస్తూ కాంగ్రెస్‌ నేతల తీరుతో పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి ఏకంగా మీడియా, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆయన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. కాగా.. తమ మద్దతుదార్లయిన కార్పొరేటర్లకు విదేశీ టూర్‌ను ఆఫర్‌ చేశారు. అంతా ఆశ్చర్యపోయేలా కాస్ట్‌లీ టూర్‌కు తీసుకెళ్లడంతో ఆయా పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇంత ఖరీదైన టూర్‌ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఏకంగా కార్పొరేటర్లను, వారి భర్తలను విదేశీ పర్యటనకు తీసుకెళ్లి ఆనంద డోలికల్లో ముంచెత్తడం గమనార్హం.

Please follow and like us:
తెలంగాణ వార్తలు