నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సంకల్పించింది.

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సంకల్పించింది.

డెత్ రోడ్డుగా పిలిచే ఈ హైవే మచిలీపట్నం – పూణేతో కలుపుతుంది. NH65లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15మండలాల్లో 33 గ్రామాల మీదుగా 181 కిలోమీటర్ల ఈ రహదారి వెళుతోంది. ఈ హైవేను 2015లో జిఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసింది. కేవలం అక్కడక్కడ మాత్రమే అండర్ పాస్‎లు, సర్వీస్ రోడ్లను మాత్రమే జిఎంఆర్ సంస్థ నిర్మించింది. కొన్ని గ్రామాల్లో రోడ్డును ఎత్తుగా నిర్మించారు. ఈ హైవేకు ఇరువైపుల 33 గ్రామాలు ఉండగా, కేవలం 20 గ్రామాల్లో మాత్రమే సర్వీస్ రోడ్డు నిర్మించారు. కొన్నిచోట్ల బైపాస్ రోడ్లకు లింకు రోడ్లను కూడా ఏర్పాటు చేయలేదు.

నాలుగు లైన్లుగా మారి దశాబ్దం దాటినా ఆగని ప్రమాదాలు..
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి దశాబ్దం దాటినా ఇంకా ప్రమాదాలకు తగ్గడం లేదు. నిత్యం రక్తసిక్తమవుతోంది. నిత్యం 45 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం సెలవు దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 181 కిలోమీటర్ల మేర ప్రయాణానికి నాలుగున్నర నుంచి ఐదు గంటలు పడుతోంది. ఏటా వందలాది ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో వందలాదిమంది మృత్యువాత పడుతుండగా, అనేక మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు.

ఈ హైవేపై ప్రముఖులు మృత్యువాత..
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ప్రమాదాలు అధికమే. రద్దీ కారణంగానే దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత సీఎం ఎన్టీ రామారావు కుమారుడు హరిక్రిష్ణ, మనవడు జానకి రాం ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేతలు లాల్ జాన్ బాషా లాంటి ఎందరో చనిపోయారు. రాంగ్ రూట్‎లో వాహనాలు ప్రయాణించడం, డీప్ కర్వ్‎లు, ఆగి ఉన్న వాహనాలతో వరుస ప్రమాదాలతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ హైవేపై గత ఏడాది 918 రోడ్డు ప్రమాదాలు జరిగ్గా, 318 మంది మృతి చెందారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 92 ప్రమాదాలు జరుగగా, 46 మంది మృతి చెందారు.

హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు..
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే 17 ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లు బ్లాక్ స్పాట్స్‎గా గుర్తించింది. ఈ హైవేపై చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్,ఇనుపాముల, టేకుమట్ల, ఎస్.వీ.కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపూరం, అకుపాముల, కోమరబండా ఎక్స్ రోడ్, కట్టకొమ్మ గూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, రామాపురం ఎక్స్ రోడ్డు, నవాబ్ పేట్ జంక్షన్ లను బ్లాక్ స్పాట్స్ గా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.

రూ. 326 కోట్ల వ్యయంతో బ్లాక్ స్పాట్స్ వద్ద దిద్దుబాటు చర్యలు..
ఈ హైవేపై ఉన్న బ్లాక్‌ స్పాట్స్‌ మరమ్మతులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్షించారు. 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో పనులకు రూ.326 కోట్ల వ్యయంతో ప్రాథమిక దిద్దుబాటు చర్యలను చేపట్టారు. బ్లాక్ స్పాట్స్ వద్ద సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, జంక్షన్ డెవలప్ మెంట్స్, VUP (వెహికిల్ అండర్ పాస్) లు, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ప్రమాదాలను అరికడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. చిట్యాల వద్ద రూ.40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫ్లై ఓవర్‎కు ఆయన శంకుస్థాపన చేశారు. చౌటుప్పల్‎లో రూ. 140 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టే అండర్ పాసులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ కాంట్రాక్ట్‌ను హరియాణాకు చెందిన రాంకుమార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. డిసెంబర్ నాటికి ఈ పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ గా నిర్ణయించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు