హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవుతోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు దాదాపుగా తిరస్కరించినట్లు తేలిపోయింది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రెబెల్స్ అని తెలుస్తోంది. బీజేపీ ఈసారి పలు సీట్లలో కొత్త అభ్యర్ధుల్ని రంగంలోకి దించడంతో సీట్లు రాని వారంతా రెబెల్స్ గా పోటీ చేసి ఆ పార్టీని దెబ్బతీశారు. దీంతో ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందినట్లు అర్ధమవుతోంది.

అయితే చాలా సీట్లలో రెబెల్స్ బీజేపీ అవకాశాల్ని దెబ్బతీసినా.. మరికొన్ని చోట్ల పోటీ చేసి గెలవబోతున్న రెబెల్స్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఫోన్లు చేసి ఇప్పటికే తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. మరోవైపు గెలిచే అవకాశాలున్న రెబెల్స్ ను బుజ్జగించేపనిలో పడింది. ముగ్గురు రెబెల్ అభ్యర్దులు ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ నేతలు వారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా నలాగఢ్ నుండి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి కేఎల్ ఠాకూర్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి లఖ్వీందర్ సింగ్ రాణాపై ఆయన ఇఫప్టికే 5631 ఓట్ల ఆధిక్యంతో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఎల్‌ఎస్ రాణాను నలాగఢ్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీకి దింపాలని బీజేపీ ఎంచుకుంది. రాణా 2017లో ఠాకూర్‌పై విజయం సాధించగా, 2012లో ఠాకూర్ ఆయనను ఓడించారు. అలాగే డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మరో బిజెపి రెబల్ హోష్యార్ సింగ్ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ రాజేష్ శర్మపై 4823 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన హోష్యార్ సింగ్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. అయితే డెహ్రా నుండి పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాషాయ పార్టీతో తెగతెంపులు చేసుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మరో బీజేపీ నేత హితేశ్వర్ సింగ్ బంజార్ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ఖిమి రామ్‌పై 636 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హమీర్‌పూర్ నుండి పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్ ఆశిష్ శర్మ విజయం దిశగా సాగుతున్నారు.

Please follow and like us:
జాతీయం వార్తలు