మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ్యతిరేకిస్తూ కర్ణాటకలో నిరసనలు మిన్నంటాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ మాట్లాడే ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర వాహనాలపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

డిసెంబర్ నెల వచ్చిందంటేచాలు కొనసాగే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం..
కాగా ప్రతి ఏటా డిసెంబరులో మహారాష్ట్ర- కర్ణాటక మధ్య సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది. ఆ వాగ్వాదాలు.. భౌతిక దాడులకు దారి తీస్తుంటాయి. డిసెంబరు నెలలో సరిహద్దు వివాదం ఎందుకంటే..మహారాష్ట్ర ప్రభుత్వం తమ శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధలో నిర్వహించడమే అందుకు కారణం. బెల్గావితోపాటు ఒకప్పుడు బొంబాయి రాష్ట్రంలో భాగమైన బీజాపూర్‌, ధార్వాడ్‌, ఉత్తర కెనరా జిల్లాలను.. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మైసూరులో కలపడమే ఈ వివాదానికి మూలంగా ఉంది. 1953లో ఏర్పాటు చేసిన ఫజల్‌ అలీ కమిషన్‌.. నాలుగు జిల్లాలపై మైసూరు రాష్ట్రానిదే పూర్తి అధికారం అని నివేదిక సమర్పించింది.

1956 నుంచి కొనసాగుతున్న వివాదం..
1956 తరువాత ఏర్పడిన గుజరాత్..బొంబాయి రాష్ట్రం నుంచి విడగొట్టి గుజరాత్ ను 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. బొంబాయి రాష్ట్రం నుంచి ఆ నాలుగు జిల్లాలతోపాటు.. ఆంధ్ర రాష్ట్రం నుంచి బళ్లారి, మద్రాసు రాష్ట్రం నుంచి దక్షిణ కెనరా.. హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి కొప్పల్‌, రాయ్‌చూర్‌, కలబుర్గి, బీదర్‌ జిల్లాలను, కూర్గు స్టేట్‌ను ఒక జిల్లాగా చేసి.. మైసూరు రాష్ట్రంలో కలిపారు. వీటిలో.. బొంబాయి రాష్ట్రం నుంచి కలిపిన నాలుగు జిల్లాలపైనే ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లోని మొత్తం 865 పట్టణాలు గ్రామాలు తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. అంటే అప్పట్లో ఫజల్‌ అలీ కమిషన్‌ నివేదికను మహారాష్ట్ర ఈనాటికి అంగీకరించకపోవటంతో ఈ వివాదం కొనసాగుతోంది. కాగా..కర్ణాటక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ వివాదం కొనసాగుతునే ఉంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కూడా కొనసాగుతునే ఉంది.

పౌరుషాల వివాదం..ఆత్మగౌరవాల నినాదాలు
ఈక్రమంలో ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది. మాటలు తూటాల్లా పేలుతుంటాయి. గొడవలు, ఘర్షణలు కొనసాగుతునే ఉంటాయి. మాది పౌరుషం ఒక రాష్ట్రవారు అంటే మరొకరు మాది ఆత్మగౌరవం అంటారు. అలా వారి వివాదాలు వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌. బస్సులు ధ్వంసం చేయటమే కాదు ఒక్కోసారి బస్సులను తగలబెట్టడం వరకు వెళుతుంది. ఒకరి జాతి ప్రతీకలను మరొకరు అవమానించడం కూడా షరా మామూలుగా జరుగుతుంటుంది. ఈ పౌరుషాల వివాదం..ఆత్మగౌరవాల నినాదాలు కొన్నిరోజులపాటు సాగి క్రమంగా పరిస్థితి సద్దుమణుగుతుంది. మళ్లీ డిసెంబరు నెల వస్తే షరా మామూలే..ఈ సెగలో రాజకీయ పార్టీలు చలికాచుకుంటుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. లేదంటే దశాబ్దాల కాలం నుంచి ఇరు రాష్ట్రాల్లోను వివిధ ప్రభుత్వాలు మారాయి. ఎవ్వరు ఈ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా యోచన చేయపోవటం ఈ వివాదం కొనసాగటానికి కారణమనే చెప్పుకోవాలి.

Please follow and like us:
జాతీయం వార్తలు