ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..

ప్రత్యర్థి పార్టీల్లో కొనసాగిన ఆ ఇద్దరు నేతలు ఒకే గూటికి చేరారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ముఖ్య నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరులో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారోనన్న చర్చ ఓ వైపు సాగుతుండగానే ఆ ఇద్దరు నేతలు మాత్రం తమ ప్రాంత అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్న తీరు సరికొత్త చర్చకు దారి తీసింది. సొంత ఇలాకాలో పట్టు కోసం తమ శ్రేణుల మధ్య వైరాన్ని పెంచి పోషించడం కంటే ఎక్కువగా ప్రజల్లో తమ క్రెడిట్ దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు.

ఎమ్మెల్యే సంజయ్..
ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల అభివృద్ది కోసం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులను కలిసి అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గ కేంద్ర సమీపంలోని నూకపల్లిలో నిర్మించిన డబుల్ ఇళ్లలో మౌళిక సదుపాయలను కల్పించేందుకు నిధులు కేటాయించాలని కోరారు డాక్టర్ సంజయ్. ఆయన అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జీఓలను జారీ చేసింది. డబుల్ బెడ్ రూం ఇండ్లతో యావర్ రోడ్డు అభివృద్ది కోసం కూడా డాక్టర్ సంజయ్ రూ. 25 కోట్లు మంజూరు చేయించినట్టుగా చెప్తున్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
మరో వైపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా దూకుడు పెంచారు. నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా యావర్ రోడ్డుకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నూకపల్లిలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో తన పట్టు నిలుపుకునేందుకు అభివృద్ది కోసం నిధులు కేటాయించాలని ప్రముఖులను కలుస్తుండడం విశేషం.

అభివృద్ది మంత్రం..
జగిత్యాలకు చెందిన ముఖ్య నేతలు ఇద్దరు కూడా ఆధిపత్య పోరులో అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారు. నియోజకవర్గంలో తమ పట్టు జారిపోకుండా ఉండాలంటే తామేంటో నిరూపించుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిశారు. మరికొంత మంది మంత్రులను కూడా కలిసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ది గురించి నిధులను కేటాయించాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కోరే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇద్దరు నేతలు కూడా నూకపల్లిలో నిర్మించిన ఇండ్ల విషయంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. తన హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను బాగు చేయించి లబ్దిదారులకు ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుతుండగా, తాను చొరవ తీసుకుని కట్టించిన నూకపల్లి డబుల్ ఇండ్లకు మౌళిక వసతులు కల్పించి లబ్ది చేకూర్చాలని కోరుతున్నారు ఎమ్మెల్యే సంజయ్. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు నేతలు కూడా నూకలపల్లి కేంద్రంగానే తమ క్రెడిట్ దక్కించుకోవాలని తపన పడుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే స్థానికులు మాత్రం ఇద్దరు ముఖ్య నేతలు అభివృద్ది విషయంలో ఇలాగే పోటీ పడినట్టయితే జగిత్యాల రూపురేఖలే మారిపోతాయని అంటున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు