అర్హులకు దక్కని కిసాన్‌ సమ్మాన్‌

అర్హులకు దక్కని కిసాన్‌ సమ్మాన్‌

అందని సాయం… జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 2.80 లక్షల మంది రైతులు ఉన్నారు. 3.97 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది

పథకంలో చేరేందుకు అయిదేళ్లుగా ఎదురుచూపులు

దుక్కి దున్నుతున్న రైతు

అందని సాయం… జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 2.80 లక్షల మంది రైతులు ఉన్నారు. 3.97 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో మూడు విడతల్లో ఏప్రిల్‌-జులై, ఆగష్ట్టు-నవంబర్, డిసెంబర్‌- మార్చిలలో అర్హులకు విడతలుగా నిధుల బదిలీ చేపడుతున్నారు. 2018 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్‌గా పెట్టుకుని ఆలోపు భూమి యాజమాన్య హక్కులు ఉన్నవారు పథకంలో నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కులు కలిగిన వారికి ఈ పథకంలో చేరడానికి అవకాశం కల్పించడం లేదు. దీంతో వేలాది మంది రైతులు ఈ పథకంలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త పట్టాదారుల నమోదుకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో లబ్ధిదారుల నమోదుకు అవకాశం లేకపోయింది. పీఎం కిసాన్‌ పోర్టల్‌ అందుబాటులో లేకపోవడంతో కొత్త పట్టాదారులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయం కోల్పోవాల్సి వస్తోందని అర్హులైన రైతులు వాపోతున్నారు.

ఓ వైపు కొత్తవారికి అవకాశం ఇవ్వకపోగా పాత వారిని జాబితాలో నుంచి తొలగిస్తున్నారు. ఈకేవైసీ పూర్తిచేయని వారికి, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేనివారికి నిధులు అందడం లేదు. రేషన్‌ కార్డుల ఆధారంగా కుటుంబంలో ఒకరినే పరిగణనలోకి తీసుకోవడం, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని క్రమంగా పథకంలో నుంచి తొలగిస్తున్నారు. పథకానికి అనర్హులను క్రమంగా తొలగిస్తుండటంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తొలి విడతలో జిల్లాలో 1.43 లక్షల మంది రైతులకు నిధులందగా.. ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య 95 వేలకు తగ్గింది. కొత్త రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తే వేలల్లో రైతులు ఈ పథకంలో చేరనున్నారు. త్వరలో కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని, కొత్త వారికి అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూడాలి.

పీఎం కిసాన్‌ పథకంలో చేరి ఆర్థిక సాయం పొందాలనుకునే కొత్త పట్టాదారులకు నిరాశే ఎదురవుతోంది. అర్హులైన పలువురు రైతుల పేర్లు నమోదు కాకపోవడంతో ప్రభుత్వ సాయానికి నోచుకోవడం లేదు. ఐదెకరాల లోపు భూమి కలిగిన వారికి ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల కేంద్రం సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కొత్త రైతులను నమోదు చేసే ప్రక్రియ చేపట్టకపోవడంతో అనేక మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకాన్ని ప్రారంభించింది. కానీ అయిదేళ్లుగా పీఎం కిసాన్‌ నమోదు పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కొత్తగా అర్హులైన రైతులు పేర్లు నమోదు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురుచూస్తున్నారు.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి కొత్తగా లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. 2019 తర్వాత లబ్ధిదారులను పథకంలో చేర్చలేదు. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే వెంటనే లబ్ధిదారుల నమోదుకు చర్యలు తీసుకుంటాం

Please follow and like us:
తెలంగాణ వార్తలు