అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!

అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!

బంగ్లాదేశ్‌పై 2/13
అఫ్గానిస్థాన్‌పై 4/7
బుమ్రాపై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడని కితాబిచ్చాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్ సాధిస్తే.. అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా బుమ్రా నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చని ఇర్ఫాన్‌ ధీమా వ్యక్తం చేశాడు. పోటీ ప్రపంచకప్‌లో బుమ్రా అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (3/14)తో సంచలన ప్రదర్శన చేశాడు. సూపర్-8లో అఫ్గానిస్థాన్‌పై (4/7), బంగ్లాదేశ్‌పై (2/13)తో మెరిశాడు. బంగ్లా మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ… ‘బుమ్రా భారత జట్టుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటోడు. అతడు నమ్మదగిన బౌలర్‌. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా బుమ్రా నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చు. ఏ పరిస్థితిలోనైనా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి రాణిస్తాడు. అతను ఆటను సెట్‌ చేస్తాడు. ప్రస్తుత క్రికెట్‌లో బుమ్రా మాదిరి బౌలింగ్‌ టోన్‌ సెట్‌ చేయడం మరే బౌలర్‌ వల్ల సాధ్యం కాలేదు’ అని చెప్పాడు.

‘ఆఫ్ఘనిస్తాన్ మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా రెండవ ఓవర్‌ బౌలింగ్ చేశాడు. అర్ష్‌దీప్ మొదటి ఓవర్లో 12 రన్స్ ఇచ్చాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఊపందుకుంది. రెండో ఓవర్లో బుమ్రా ప్రభావం చూపాడు. భారత బౌలింగ్‌ దళానికి బుమ్రా పెద్దన్న లాంటోడు. అతను నిలకడగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు స్లో బాల్స్‌ కూడా వేస్తాడు. అవసరమైనప్పుడు మాత్రమే బౌన్సర్‌లు వేస్తాడు. ఈ ప్రపంచకప్‌లో ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా రివర్స్‌ కూడా రాబడుతున్నాడు. భారత్ ఈ ప్రపంచకప్‌ సాధిస్తే.. అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుంది’ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.

Please follow and like us:
క్రీడలు వార్తలు