గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌

టీమిండియాపై ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే తాము మ్యాచ్‌ను కోల్పోయాం అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్స్ కోల్పోవడం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ బాదాలనుకున్నాం అని, కానీ అది కుదరలేదని బాబర్ చెప్పాడు. ఇది తాము గెలవాల్సిన మ్యాచ్ అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 6 పరుగుల తేడాతో ఓడింది.

మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. ‘మేం బాగా బౌలింగ్ చేశాం. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడమే కాకుండా.. ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాం. ఇదే మాకు ప్రతికూలంగా మారింది. స్వల్ప ఛేదన కాబట్టి ప్రత్యేక ప్రణాళికలతో మేం బరిలోకి దిగలేదు. సింపుల్‌గా ఆడాలనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాలనుకున్నాం. ఈ ప్రక్రియలో ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాం. ఇదే మా ఓటమికి కారణమైంది’ అని బాబర్ తెలిపాడు.

ఛేదనలో టెయిలెండర్ల నుంచి పెద్దగా ఆశించలేదు. పవర్‌ప్లేను బాగా ఉపయోగించు కోవాలనుకున్నాం. కానీ ఓ వికెట్ పడగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి ఆరు ఓవర్లలో మా మార్క్‌ను చూపించలేకపోయాం. పిచ్ బాగుంది. బంతి చక్కగా వచ్చింది. కానీ పిచ్ కాస్త స్లోగా ఉంది. కొన్ని బంతులు ఎక్స్‌ట్రా బౌన్స్ అయ్యాయి. సూపర్ 8 చేరుకోవాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. మా తప్పుల గురించి విశ్లేషించుకుంటాం. చివరి మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను’ అని బాబర్ ఆజమ్‌ చెప్పుకొచ్చాడు.

Please follow and like us:
క్రీడలు వార్తలు