కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటివరకూ ఆమె కలవలేదు. ఇతర ఐఏఎస్ లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినా స్మిత మాత్రం దూరంగా ఉండిపోతున్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగిన స్మితా సభర్వాల్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పవన్న ప్రచారం మధ్య తనపై వస్తున్న కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ వార్తలపై స్మితా సభర్వాల్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె ఓ ట్వీట్ చేశారు. ఇందులో తన కొత్త బాధ్యతలపై స్మిత స్పందించారు. తాను కేంద్ర సర్వీసులకు వెళ్తున్నట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ అదంతా అబద్ధం, నిరాధారమని ఆమె తెలిపారు.

https://x.com/SmitaSabharwal/status/1734981241445961827?s=20

    తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదని స్మితా సభర్వాల్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఇక్కడే ఉంటానని స్మిత తేల్చి చెప్పేశారు. అలాగే తెలంగాణలో కొత్త సర్కార్‌ ఇచ్చే ఏ బాధ్యత అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగేందుకు ఆమె సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లయింది.

    మాజీ సీఎం కేసీఆర్‌ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖకు ఇంచార్జ్‌ సెక్రటరీగా ఉన్నారు. ఇరిగేషన్‌పై తాజాగా జరిగిన సమీక్షకు కూడా ఆమె గైర్హాజరు కావడంతో కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న ఊహాగానాలు వచ్చాయి.అదే సమయంలో స్మితా సబర్వాల్ సీఎం రేవంత్‌రెడ్డిని కలవకపోవడంపైనా చర్చ జరుగుతోంది. అయితే తాజా ట్వీట్ తో ఆమె ఊహాగానాలకు తెరదించారు. మరోవైపు 23ఏళ్ల కిందటి ఫోటో ఎక్స్ లో షేర్ చేసిన స్మితా.. 23ఏళ్లలో తను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడైనా రెడీ అంటూ ట్వీట్ చేశారు.

    Please follow and like us:
    జాతీయం వార్తలు