ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే ఆరుసార్లు డెలివరీ.. అవాక్కైన కస్టమర్!

ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే ఆరుసార్లు డెలివరీ.. అవాక్కైన కస్టమర్!

ఇంటిలో సరుకులు అయిపోవడంతో ఓ వ్యక్తి.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. తనకు అవసరమైన సామాన్లు ఎంపిక చేసి.. పేమెంట్ చేశాడు. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినా… ఆర్డర్ మాత్రం పెండింగ్ చూపింది. దీంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా అలాగే జరిగింది. చివరకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో వేరే యాప్‌లో ఆర్డర్ చేసుకుని సరుకులు తెప్పించుకున్నాడు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. తాను ఆర్డర్ చేసిన వస్తువు ఆరుసార్లు డెలివరీ అయ్యింది. ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు తన తలుపుతట్టడంతో అతడు షాకయ్యాడు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని కస్టమర్ ట్విట్టర్‌ (ఎక్స్) వేదికగా పంచుకున్నాడు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్ లోయ అనే వ్యక్తి ఇంట్లో సరకుల కోసం స్విగ్గీ యాప్‌లో ఆర్డర్‌ పెట్టారు. ఆన్‌లైన్‌లో నగదును చెల్లించినప్పటికీ ఆర్డర్‌ స్టేటస్‌‌లో మాత్రం ‘క్యాన్సిల్‌’ అని చూపించింది. మరోసారి ఆర్డర్‌ పెట్టినా అలాగే జరిగింది.

దీంతో కొన్ని వస్తువులను మాత్రమే ఆర్డర్ చేసి.. క్యాష్‌ ఆన్‌ డెలివరీ అని పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన ప్రణయ్.. మరో యాప్‌లో ప్రయత్నించాడు. జెప్టో యాప్‌లో తనకు అవసరమైన సరకులను ఆయన ఆర్డర్‌ పెట్టుకున్నారు. అయితే, కాసేపటికి ప్రణయ్‌ ఫోన్‌కు వరుసగా కాల్స్‌ రాక మొదలయ్యింది. తలుపు తెరిస్తే ఆయన గుమ్మం ముందు ఒకరి తర్వాత మరొకరు ఆరుగురు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ దర్శనమిచ్చారు. మొత్తం 20 లీటర్ల పాలు, 6 కిలోల దోశల పిండి, ఆరు ప్యాకెట్ల పైనాపిల్ సహా ఇతర సరుకులు ఆయన చేతిలో పెట్టారు.

యాప్‌లో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ‘వీటిని నేనేం చేసుకొను?’ అంటూ ‘ఎక్స్‌’ ద్వారా తన అనుభవాన్ని ప్రణయ్‌ పోస్ట్‌ చేశారు. ‘పేదలకు పంచిపెట్టండి’ అంటూ ఓ నెటిజన్‌ సూచించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. వేలాదిగా వ్యూస్, వందలాదిగా కామెంట్లు వచ్చాయి. దీనిపై స్విగ్గీ స్పందిస్తూ.. అంతరాయానికి చింతిస్తున్నామని పేర్కొంది. మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, దయచేసి మీ ఆర్డర్ ఐడీని మాకు పంపితే వెంటనే పరిశీలిస్తామని తెలిపింది.

Please follow and like us:
జాతీయం వార్తలు