చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!

చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!

ఒమన్‌పై ఇంగ్లండ్‌ పంజా
షోయబ్ ఖాన్ మాత్రమే
ఇంగ్లండ్‌ సూపర్‌-8 ఆశలు సజీవం

టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సంచలన విజయం సాధించింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై ఇంగ్లీష్ టీమ్ పంజా విసిరింది. ఒమన్‌ నిర్ధేశించిన 48 పరుగుల లక్షాన్ని ఇంగ్లండ్‌ రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ జోస్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో 4X4, 1X6) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ సూపర్‌-8 ఆశలను సజీవం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీన్ (4/11), మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) దెబ్బకు ఒమన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఒమన్‌ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ (11; 23 బంతుల్లో 1X4) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. ప్రతీక్ అథవాలే (5), కశ్యప్ (9), అకిబ్ ఇలియాస్ (8), జీషన్ మక్సూద్ (1), ఖలీద్ కైల్ (1), అయాన్ ఖాన్ (1) విఫలమయ్యారు.

స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. తొలి రెండు బంతులను ఫిల్ సాల్ట్ (12; 3 బంతుల్లో 2X6) స్టాండ్స్‌కు తరలించాడు. మూడో బంతికి మరో షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆపై జోస్ బట్లర్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ (5) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. జానీ బెయిర్‌స్టో ఆడిన రెండు బంతులను బౌండ్రీలకు తరలించడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది.

Please follow and like us:
క్రీడలు వార్తలు