కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్‌ కండువా సొంత గూటికి చేరిపోయారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌ పనిచేశారు.

1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్‌.. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి డీఎస్, తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన డీఎస్.. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన డీఎస్ సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తండ్రి మృతి పట్ల డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. “అన్నా..అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY ! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు,ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు.” అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..
డీఎస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్, రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డీ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.విచారం వ్యక్తం చేశారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్న కిషన రెడ్డి, డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన, బీజేపీ ఎంపీ అరవింద్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు