మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..

మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..

రాష్ట్ర ఆదాయం, అప్పులపై ఏపీ ప్రజలకు వివరించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే మూడు అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సీఎం వారం రోజుల్లో ఆర్థికశాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఏపీకి 14లక్షల కోట్లకుపైగా అప్పులున్నట్లు ఆర్థికశాఖపై సమీక్షలో సీఎంకి వివరించారు అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం.. మరో శ్వేతపత్రం రిలీజ్‌ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ నెల 18న ఆర్థికశాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక అంశాలు, బడ్జెట్ పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయం, అప్పుల లెక్కలను ఆర్థికశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకూ అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లకు పైనే ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారు, ఏ శాఖల నిధులు ఇతర పనులకు మళ్లించారనేది కూడా వివరాలివ్వాలన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే దానిపైనా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. పలు శాఖల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపులపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు. కేంద్ర నిధులపై నిత్యం ఆయా కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు సీఎం. గత ప్రభుత్వం నిర్వాకంతో.. రాష్ట్రం ఏవిధంగా దెబ్బతిందో ప్రజలకు వివరించేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం సందర్భంగా.. లేజర్ లైట్ పనిచెయ్యకపోవడం, పలు టెక్నికల్ సమస్యలు రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. దీంతో.. ఆర్థికశాఖపై శ్వేతపత్రం సందర్భంగా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు