ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..

ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన కీలక నేత సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్‌ జనసేన నుంచి నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు. ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. సి. రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉపఎన్నిక జరగనుంది. టీడీపీ నేత రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి అవకాశం కల్పించింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వాళ్లిద్దరూ జూలై 2న నామినేషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సి. రామచంద్రయ్య. కార్యకర్తల సాధకబాధలు తెలిసిన వ్యక్తి , ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‎కి రుణపడి ఉంటానన్నారు పి.హరిప్రసాద్. పాత్రికేయుడిగా అనేక సమస్యలమీద పరోక్షంగా పోరాటం చేశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తాననన్నారు హరిప్రసాద్‌. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో సి. రామచంద్రయ్య, హరిప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ జూన్‎లో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జులై 2 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. జులై 3 నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. జులై 5 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జూలై 12న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు