SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్‌!

SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్‌!

South Africa Beat Sri Lanka in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో దక్షిణాఫ్రికా ఘనమైన బోణీ కొట్టింది. గ్రూప్‌-డిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా (4/7) ధాటికి లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. కాగిసో రబాడ (2/21), కేశవ్‌ మహరాజ్‌ (2/22) కూడా చెలెరుగడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. 19 పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌ టాప్‌ స్కోరర్‌. స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్‌ (19 నాటౌట్‌), క్వింటన్ డికాక్‌ (20) రాణించారు. నోకియాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక విలవిల్లాడిపోయింది. నోకియా పేస్‌కు లంక దాసోహమైంది. పరుగులు చేయడానికి లంక బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్‌ మొత్తంలో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు మాత్రమే వచ్చాయంటేనే.. లంక ఎంతగా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. ఔట్‌ ఫీల్డ్‌ కూడా మందకొడిగా ఉంది. నాలుగో ఓవర్లో నిశాంక (3)ను బార్ట్‌మ్యాన్‌ ఔట్‌ చేయడంతో శ్రీలంక పతనం మొదలైంది. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో కమిందు మెండిస్‌ (11)ను ఔట్‌ చేసిన నోకియా.. పదో ఓవర్లో కుశాల్‌ మెండిస్‌ను పెవిలియన్ చేర్చాడు. వరుస బంతుల్లో హసరంగ (0), సమరవిక్రమ (0)ను మహరాజ్‌ ఔట్‌ చేసి లంకను దెబ్బతీశాడు. 9 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన లంక 10 ఓవర్లలో 40/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు.

ఛేదనలో శ్రీలంక కూడా బాగా బౌలింగ్‌ చేసింది. విజయం సాధించిన దక్షిణాఫ్రికా కూడా కాస్త ఒత్తిడికి గురైంది. పరుగుల కోసం ప్రొటీస్ శ్రమించింది. 13 ఓవర్లు ముగిసే సరికి హెండ్రిక్స్‌ (4), మార్‌క్రమ్‌ (12), డికాక్, స్టబ్స్‌ (13) వికెట్లు కోల్పోయి కేవలం 58 పరుగులే చేసింది. అయితే క్లాసెన్, మిల్లర్‌ మరో వికెట్‌ పడకుండా పని పూర్తి చేశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఖాతాలో రెండు పాయింట్స్ చేరాయి.

Please follow and like us:
క్రీడలు