గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ఇటీవల పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీలో వాలంటీర్లను ఎలా వినియోగించుకోవాలి అన్న అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామి మేరకు.. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశాలు ఉన్నా.. వారికి విధి విధానాలు ఏంటి అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. సోమవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం ఉంచాలని నిర్ణయించారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఒకటవ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు డోర్ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

ఇక ఏపీ కేబినెట్ భేటీలో పింఛన్ల పెంపునకు ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పేరిట అందించే సామాజిక పింఛన్ల మొత్తాన్ని నెలకు రూ.3000 నుంచి రూ.4000 పెంచే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెంచిన పింఛన్ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది.. లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామి మేరకు ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్ కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు నెలలు.. నెలకు వెయ్యి చొప్పున 3 వేలు బకాయిలతో కలిపి మొత్తం రూ.7000లను అందజేయనున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు