పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు మంగళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశముంది.
పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు మంగళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశముంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ సంప్రదింపులను ముమ్మరం చేసింది. ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటోంది.
మాజీ స్పీకర్ ఓం బిర్లా మరోసారి స్పీకర్ కాబోతున్నారా? లేదంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి పురంధేశ్వరి స్పీకర్ సీట్లో కూర్చోబోతున్నారా? రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. గతంలో ఎవరూ ఊహించని నేతలను తెరపైకి తెచ్చింది బీజేపీ నాయకత్వం. ఈసారి కూడా బీజేపీ నిర్ణయించే అభ్యర్థికే తమ మద్దతు అని మిత్రపక్షాలు ప్రకటించాయి. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుంది.
అయితే ఎన్డీయే మాజీ స్పీకర్ ఓం బిర్లా పేరు మరోసారి పరిశీలనలో ఉన్నప్పటికీ విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లోక్సభలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నందున ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు కీలకమైన స్పీకర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా లేదా అనేది మంగళవారం స్పష్టత రానుంది. మరోవైపు స్పీకర్ అభ్యర్థి విషయంపై బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే తమను సంప్రదించిందని ఎన్డీఏలోని రెండు ప్రధాన భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు పేర్కొన్నారు. అయితే చర్చల వివరాలను, ప్రస్తావనకు వచ్చిన పేర్లను మాత్ర వెల్లడించలేదు. ఎన్డీఏ వైఖరిని ఆధారంగానే తామ అభ్యర్థిని పోటీకి దింపాలా లేదా అనేది నిర్ణయిస్తామని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
18వ లోక్సభలో ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్ నియమితులయ్యారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక వరకు ఆయన లోక్సభ ప్రిసైడింగ్ అధికారి బాధ్యతలను నిర్వర్తిస్తారు. కొత్త లోక్సభ స్పీకర్ ఎన్నికను ఆయనే నిర్వహిస్తారు. లోక్సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ప్రధాని తన మంత్రి మండలిని సభకు పరిచయం చేయనున్నారు. జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 28న చర్చ ప్రారంభం కానుంది. జులై 2 లేదా 3న చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారని భావిస్తున్నారు.