తిరుమల అంటే పవిత్రతకు మారుపేరు.. భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో.. తిరుమల లడ్డూ, ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ, ప్రసాదాల తయారీలో యానిమల్ ఫాట్ వినియోగించారన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కుదిపేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్లు చెయ్యడం పెను సంచలనంగా మారింది.. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ వైసీపీ స్పందించింది.. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ ను షేర్ చేశారు.
వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..
దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని.. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు.. ఇలాంటి ఆరోపణలు చేయరంటూ పేర్కొన్నారు.
రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?.. అంటూ ప్రశ్నించారు.
కాగా.. బుధవారం సీఎం చంద్రబాబు మంగళగిరిలో ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సంసదర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుమలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందన్నారు. ఆఖరికి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని.. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిన దారుణ పరిస్థితి ఉందంటూ పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును వైసీపీ ప్రభుత్వం వినియోగించిందంటూ ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే నందినీ నెయ్యి నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామన్నారు.