నాకు చిన్న బిడ్డ ఉన్నాడు.. వాడి ఫ్యూచర్ ఏంటి..? వాడికో ఆదరువు చూపించాలి కదా..? అంటూ తన మెట్టినింటి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది. భర్త దహన సంస్కారాలను అడ్డుకుంది.
ఆస్తి కోసం దహన సంస్కారాలు ఆగిపోయాయి. ఎదో ఒకటి తేల్చాలని భార్య పట్టుబాట్టింది. లేదంటే తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యకం చేసింది. దీంతో రెండు రోజులు వ్యక్తి దహన సంస్కారాలు ఆగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపెల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా హైదరాబాదులో ఉంటున్నాడు. సిటీకి చెందిన సంధ్య అనే యువతితో సునీల్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాదులో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడ ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మంథని గోదావరినది వద్దకు దహన సంస్కారాల కోసం తీసుకువచ్చారు. అయితే మృతుని భార్య సంధ్య మంథనికి వచ్చి దహన సంస్కారాలు కాకుండా అడ్డుకుంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దహన సంస్కారాలు కాకుండా అడ్డుకోవడంతో స్థానికులు, అధికారులు ఎంత నచ్చ చెప్పిన సంధ్య వారి కుటుంబ సభ్యులు వినలేదు.
సుమారు రెండు రోజుల పాటు గోదావరినది ఒడ్డున సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం వేచి చూశారు. చివరకు గ్రామానికి చెందిన పెద్దమనుషులు నచ్చ చెప్పడంతో సంధ్య తన కుమారున్ని తీసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. కుమారుడితో కనీసం దహన సంస్కారాలు కూడా చేయించలేదని స్థానికులు అంటున్నారు.ఆస్తిలో వాటా కోసం రెండు రోజులుగా మృతదేహాన్ని దహనసంస్కారాలు కాకుండా అడ్డుకోవడం దారుణమని అంటున్నారు.. మానవత్వం మంట కలిసిందని, మనీ కున్న విలువ మనిషికి లేకుండా పోయిందనే చర్చించుకున్నారు.. మృతదేహం అడ్డం పెట్టుకొని ఆస్తి కోసం కొట్లాడిన ఇలాంటి సంఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మనుషులు..జోక్యం చేసుకోవడం తో.. సమస్య సద్దుమణిగింది.. తనకు ఎలాంటి ఆధారం లేదని..కొడుకును ఎవరు చూసుకుంటారని మృతిని భార్య తన వెర్షన్ చెబుతున్నారు.