వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రే అంటోంది పోలీసు యంత్రాంగం. అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ తేల్చారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసును సీరియస్‌గా తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. కలెక్టర్‌పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు సీఎం రేవంత్. దాడికి పాల్పడ్డవాళ్లే కాదు.. ప్రోత్సహించిన వాళ్లు, వారి వెనుకున్న వారిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులను చంపాలని చూసిన వారిని BRS ఎలా సమర్ధిస్తుందని ప్రశ్నించారు.
అసలు లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు? ఇప్పుడీ ప్రశ్నల చుట్టే పోలీస్ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రే అంటోంది పోలీసు యంత్రాంగం. అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ తేల్చారు. ఈ ఘటనలో ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. దాడి కోసం ముందుగానే కారం, కర్రలు తెచ్చిపెట్టారని గుర్తించారు పోలీసులు. ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు.. దాడిలో పాల్గొన్న వారి కాల్ డేటా కూడా ఎనాలసిస్ చేస్తున్నామన్నారు.
అయితే ఈ మొత్తం ఘటనలో భోగమోని సురేష్ అనే వ్యక్తే కుట్రదారుడని పోలీసులు గుర్తించారు. వికారాబాద్ ఎస్పీ, జిల్లా కలెక్టర్‌ను ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు నిందితుడు భోగమోని సురేష్. ముందు ఒక స్థలంలో ప్రజాభిప్రాయం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ సురేష్ మాత్రం ఇక్కడ కాదు.. గ్రామస్తులంతా వేరే ప్రాంతంలో ఉన్నారని.. అక్కడకు వెళ్దామంటూ కలెక్టర్‌పై ఒత్తిడి చేసి తీసుకెళ్లాడు. సురేష్‌ను BRS కార్యకర్తగా గుర్తించామని చెబుతున్నారు ఎస్పీ నారాయణరెడ్డి. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి.. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లగచర్ల ఘటన వెనుక ఎవరి కుట్ర ఉందనే విషయాన్ని వెలికితీస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డితో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన శ్రీధర్ బాబు.. రైతుల ముసుగులో దాడి చేసిన వారు ఎవరైనా సరే.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం ముగిసిన తర్వాత సీఎస్ శాంతి కుమారితో కూడా కలెక్టర్, ఐజీ, ఎస్‌పీ భేటీ అయ్యారు. దాడి జరిగిన తర్వాత జరుగుతున్న ఎంక్వయిరీ అప్‌డేట్‌ను సీఎస్‌కు వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి దాడి ఘటన తొలిసారి జరగడంతో.. రాష్ట్రంలో ప్రకంపలను మొదలయ్యాయి. ఓవైపు కేసుల టెన్షన్ మరోవైపు పొలిటికల్ అటెన్షన్ ఎక్కువైంది. మరి ఈ కేసులో సర్కార్ నెక్ట్స్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.