ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలుజిల్లాల్లో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు పయనించనుంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ .. బాపట్ల, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చిత్తూరు, కడప సహా రాయలసీమలో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వాతావరణశాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వానలపై కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, వరదలపై ప్రజలను SMSల ద్వారా అలర్ట్ చేయాలని సూచించారు. చెరువు కట్టలు, కాలువల పరిరక్షణపై దృష్టిపెట్టాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఏపీ సీఎస్ సమావేశమయ్యారు. పెన్నా నది పరీవాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. NDRF, ఎస్డీఆర్ఎఫ్ టీమ్లను సిద్ధం చేయాలన్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దుచేశారు. ఎగువన కురిసే వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉండటంతో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్..
తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, తిరువణ్ణామలై, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. దీంతో మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది స్టాలిన్ ప్రభుత్వం. ఐటీ కంపెనీల ఉద్యోగులు మంగళవారం నుంచి ఈనెల 18 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది.