తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం.. టీటీడీ మరో కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం.. టీటీడీ మరో కీలక నిర్ణయం

టీటీడీ తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత పెంచడంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అన్న ప్రసాదానికి బియ్యం అందిస్తన్న ఏపీ, తెలంగాణల రైస్‌ మిల్లర్లతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించా

తిరుమలలో అన్నప్రసాదాలపై టీటీడీ ఫోకస్
రైస్ మిల్లర్లతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు
నాణ్యమైన బియ్య అందించాలని వారిని కోరారు

తిరుమలలో ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.. ఈ మేరకు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జే శ్యామలరావు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాదంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో.. ఈవో జే శ్యామలరావు సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఈవో శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.. బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు దోహదపడే అంశాలను ఇవ్వాలని టీటీడీ ఈవో కోరారు. అలా బియ్యం సరఫరా చేసే టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చన్నారు. అలాగే భక్తులకు అందించే అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దంన్నర కాలం నాటివి అన్నారు. అందుకే ఆ వంట పరికరాల స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. వంట పరికరాలకు సంబంధించి.. ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో జే శ్యామలరావు తెలిపారు.

తిరుమలలో ప్రక్షాళణ దిశగా టీటీడీ ఈవో శ్యామలరావు వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అన్న ప్రసాదం, తిరుమల లడ్డూ ప్రసాదంతో పాటూగా తిరుమలలోని హోటల్స్, దుకాణదారులు అత్యధిక ధరలకు వస్తువల్ని విక్రయించడం వంటి అంశంపై ఫోకస్ పెట్టారు.. స్వయంగా ఆయన రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదుల కేటాయింపులో లోటుపాట్లను సరిదిద్దే పనిలో ఉన్నారు. ఇటీవల తిరుమలలోని ఓ హోటల్‌లో తనిఖీ నిర్వహించారు.. అలాగే ఆ హోటల్‌ను సీజ్ చేయించారు. కొండపై హోటల్స్, క్యాంటిన్లలో టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువుల్ని విక్రయించాలని సూచించారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే వారి జరిమానాతో పాటుగా నోటీసు జారీ చేస్తామని.. అవసరమైతే లైసెన్స్ రద్దు చేసేందుకు వెనుకాడబోమన్నారు.

శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవం
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో జులై 30న ఆడి కృత్తిక మహోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం శ్రీ వల్లీ దేవత, సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం తరువాత, పవిత్రమైన సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు