అది దేశంలోనే అతి పెద్ద వంటశాల.2 వేల నుంచి ప్రారంభమై ఇప్పుడు ఏకంగా దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం వండుతున్న వంటశాల. రోజూ సుమారు 12 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలతో వంటలు చేస్తూ నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్న సత్రం.4 దశాబ్దాలుగా వెంకన్న భక్తులకు రుచిగా, సుచిగా అన్న ప్రసాదం అందిస్తున్న వంటశాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ కిచెన్‌గా మారబోతుంది. ఆపదమొక్కుల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి శ్రీవారి అన్న ప్రసాదం మహా అద్భుతం. తిరుమలేశుడి దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సంపన్నుడి దాకా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానసత్రంలో అన్న ప్రసాదం స్వీకరించడం భాగ్యంగా భావిస్తారు.
ఈ నేపథ్యంలోనే నిత్య అన్నదానం కోసం ప్రతి నెల దాదాపు రూ105 కోట్లు ఖర్చు చేస్తోంది. సామాన్య భక్తుల నుంచి సంపన్న భక్తుల వరకు సాక్షాత్తు శ్రీవారి దివ్య ప్రసాదంగా అన్నదానం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొలువైన కూటమి ప్రభుత్వం తిరుమలపై దృష్టి పెట్టడంతో అన్నదానంపై టీటీడీ కూడా స్పెషల్ ఫోకస్ చేసింది. క్వాలిటీ, సర్వీస్, మోడ్రన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్‌ను అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్‌తో భేటీ అయిన టిటిడి ఈవో సమూల మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రోజూ దాదాపు లక్షల మంది భక్తులకు అందుబాటులో ఉన్న రూ. 2 వేల కోట్ల డిపాజిట్ సొమ్ముతో నిత్య అన్నదానం నిర్వహిస్తోంది.
నిత్య అన్నదానం ట్రస్ట్ కు విరాళాలుగా భక్తులు ఇస్తున్న డిపాజిట్ సొమ్ముతో అన్నదానం నిరంతరాయంగా కొనసాగిస్తోంది. తిరుమలలో రెండస్తుల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తోంది. 4 హాల్స్ ఉన్న అన్నదాన సత్రంలో ఒక్కో హాల్లో 1000 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేలా టీటీడీ వసతి కల్పించింది. అలాగే శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు, కంపార్ట్మెంటులో ఉండే భక్తులకు, నారాయణగిరి షెడ్స్‌లో ఉండే భక్తులకు టిటిడి అన్నప్రసాదాన్ని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం నుంచే సరఫరా అవుతుంది. గత 40 ఏళ్లుగా టీటీడీ నిత్య అన్నదానం ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తోంది.
కొండకు వచ్చే భక్తులు అన్న ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావిస్తుండడంతో నిరాటంకంగా అన్న ప్రసాదాన్ని టీటీడీ భక్తులకు అందిస్తోంది. భక్తులు సమర్పించే నిధుల్ని భక్తులకే ఖర్చు పెట్టే ఉద్దేశంతో టిటిడి అన్నదానం నిర్వహిస్తోంది. ఈ అన్న ప్రసాదం వితరణను టిటిడి 1985 ఏప్రిల్ 6 న అప్పటి సీఎం ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు ఇచ్చిన రూ.5 లక్షల మొదటి విరాళంతో అన్నదానం ప్రారంభమైంది. మొదటి రెండేళ్లు రోజుకు 2000 మందికి మాత్రమే పులిహోర వితరణ చేసిన టిటిడి 1987 తరువాత భోజన సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. విరాళాల సంఖ్య పెరగడంతో 2013 ఏప్రిల్ 1 నుంచి అన్న ప్రసాద పథకంగా టీటీడీ ప్రారంభించింది.
2015 లో ఆ ఒక్క ఏడాదిలోనే రూ 100 కోట్లు విరాళాలు రాగా 40 ఏళ్లుగా నిత్య అన్నదానాన్ని టిటిడి నిరంతరాయంగా కొనసాగిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా నిత్య అన్నదానం నిర్వహణ బాగాలేదని భక్తుల నుంచి వస్తున్న ఆరోపణలపై టీటీడీ దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా నిత్య అన్నదానం మరింత సమర్థవంతంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే టిటిడి ఈవో శ్యామల రావు దక్షిణ భారతదేశ చెఫ్స్ అసోసియేషన్‌తో భేటీ అయ్యారు. తిరుమలలోని గోకులం కార్యాలయంలో ప్రఖ్యాత చెఫ్‌లు, టిటిడి అధికారులతో సమావేశం నిర్వహించిన ఈవో.. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదాల తయారీ కేంద్రం ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని భావించారు.
రుచికరంగా పరిశుభ్రమైన ఆహారాన్ని భక్తులకు అందించేలా పలు సూచనలు చేసిన నిపుణుల సలహాలను పరిగణలోకి తీసుకున్నారు. చెఫ్ నిపుణుల నుంచి సూచనలు, సలహాలను తీసుకున్న టిటిడి పలు అంశాలను పరిశీలిస్తోంది. సిబ్బందికి శిక్షణ, వృత్తి నైపుణ్యం, ల్యాబ్ ఏర్పాటు, పరికరాల యాంత్రీకరణ, మూడు నెలలకు ఒకసారి ఫుడ్ అనలిస్ట్ సూచనలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. పక్కా ప్రణాళికను రూపొందించి మరోసారి సమావేశం కానున్నారు టిటిడి ఈవో శ్యామల రావు. అన్నదాన సత్రంలో సిబ్బంది కొరత ఉందని.. అన్నదాన సత్రాన్ని ఆధునీకరణ చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవాల్సి ఉందన్నారు.
బియ్యం సరిగా ఉడకడం లేదని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వాటిని నియంత్రించి మంచి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నదాన సత్రంలో ఉన్న పరికరాలు పాతబడ్డాయన్న ఈవో.. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బియ్యం ఉడికించాలంటే పెద్ద పరికరాలు అవసరం ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు అవసరమైన అత్యాధునిక పరికరాలను మార్పు చేయాలని టిటిడి ఈవో శ్యామలరావు భావిస్తున్నారు.