తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ మరింత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండ మెట్లు ఎక్కే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‌లో ఏపీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ ఫారెస్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత, తీసుకుంటున్న చర్యలపై ఈవో శ్యామల రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం చేసిన ప్రతిపాదనలను ఏపీ ఫారెస్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఈవోకు వివరించారు. ప్రతిపాదనల్లో ఏ పనులు చేపట్టారు, ఎన్ని పురోగతిలో ఉన్నాయనే అంశాలపై కూడా ఈవో సమీక్షించారు. నడక మార్గంలో చిరుతల సంచారంపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరా లే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి నడక మార్గంలో 7 వ మైలు నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సంచరించే జంతువుల కదలికలను ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈవో శ్యామల రావు.
జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలు, నిర్మాణ పనులపై జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. పనులు చాలా ఖర్చుతో కూడుకున్నవిగా భావించారు. తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కమిటీని కోరాలన్నారు. కాలినడక మార్గంలో ఏ సమయాల్లో భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయన్నదానిపై అటవీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈవో దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. ఈ మేరకు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్వీ జూ పార్క్ క్యూరేటర్ సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ సతీష్, టిటిడి సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డితో పాటు టిటిడి డిఎఫ్ఓ శ్రీనివాసులు, టిటిడి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి సమీక్షలో పాల్గొన్నారు.