ఈ నెల 23 నుంచి గ్రూప్–4కు దరఖాస్తులు
25 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. జనవరి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
2023 ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష
ఈనెల 23న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పూర్తి వివరాలు
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి.
ఆన్లైన్లో దరఖాస్తులు:
గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది.
అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే..
తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి.