ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం

ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం

తిరుమల శ్రీవారి లడ్డూ రాజకీయ దుమారం రేపింది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. శ్రీవారి లడ్డూ జంతువుల కొవ్వుతో తయారు చేసిందేనా.? ప్రభుత్వం దగ్గర ఇందుకు సంబంధించిన వాస్తవాల నివేదిక ఉందా..? తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలేంటి.? నెయ్యిపై రాజకీయమెంత.!

తిరుమల లడ్డూ.. వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ వివాదాస్పదం అయింది. లడ్డూ తయారీలో నెయ్యి కాంట్రవర్సీకి కారణమైంది. తిరుమల లడ్డూ జంతువుల కొవ్వుతో తయారయిందన్న కామెంట్ కలకలం రేపింది. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబే ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో కఠోర నిజాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉందన్న ల్యాబ్ రిపోర్ట్‌ను బయటపెట్టిన టిడిపి అసలు విజిలెన్స్ నివేదికలో ఈ విషయం ఉందా..! ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదిక నిజాలను బయటపెడుతుందా..? సీఎం దగ్గర ఈ రిపోర్టు ఉంది కాబట్టే మాట్లాడారా.? ఈ వ్యవహారంలో అధికార పక్షం వాదన ఏంటి.? ప్రతిపక్షం వర్షన్ ఏంటి అన్నదే ఇప్పుడు భక్తకోటిని వేధిస్తున్న ప్రశ్న. అయితే కూటమి నేతలు మాత్రం విజిలెన్స్ నివేదికను అసలు నిజాలు, ఆధారాలతో త్వరలోనే బయట పెడతామంటుంటే, విజిలెన్స్ నివేదికలో ఏమీ లేదని, అదొక బూటకమంటున్న ప్రతిపక్షం సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తోంది.

తిరుమల లడ్డూలపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే అంటున్న టిడిపి నేతలు.. విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించారంటున్నారు. ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసిరకం నెయ్యి వాడడానికి కారణమంటున్నారు. నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టిటిడి మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల విమర్శలు సరికాదంటున్నారు. టిటిడిని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలేనని ఆరోపిస్తున్నారు. దేశంలో కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ఆవు నెయ్యి అందుబాటులో ఉందని.. నెయ్యి సరఫరాలో అనుభవం లేని ఇతర రాష్ట్రాల్లోని ట్రేడర్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం కమిషన్ల కోసమేనన్నారు టిటిడి మాజీ బోర్డు సభ్యుడు, టిడిపి నేత ఓవి రమణ. ఇక గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ నాణ్యతను ఉద్దేశ్యపూర్వకంగానే తగ్గించిందని ఆరోపించారు బిజెపి నేతలు. కమీషన్ల కోసమే ప్రసాదాల నాణ్యతను తగ్గించారని, సీఎం వ్యాఖ్యలపై కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు మాట్లాడే అర్హత లేదన్నారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. రోజుకు 14 టన్నుల నెయ్యిని టిటిడి ప్రసాదాల తయారీకి వినియోగిస్తోందని క్వాలిటీ కంట్రోల్ కమిటీలో 9 ఏళ్లుగా ఒక్కరే కొనసాగుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా నిపుణులు లేక పోవడంతోనే 9 ఏళ్లుగా ఒకే కమిటీని కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు. టిటిడిలో కమీషన్ల సంస్కృతి తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డినేనన్నారు.

లడ్డూ తయారీలో అనిమల్ ఫ్యాట్‌పై సీఎం చంద్రబాబు చెప్పింది వాస్తవమేనంటున్న బిజెపి నేతలు.. వెంకన్న భక్తుడిగా సీఎం చంద్రబాబు చెప్పింది అక్షరాలా నిజమేనంటున్నారు. ఎడిబుల్ ఆయిల్స్‌తో పాటు జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చెప్పారని శ్రీవారి ప్రసాదాలకు తయారీకి వినియోగించే సరుకులపై నిపుణుల కమిటి ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ నివేదిక త్వరలో బయటకు రానుందిన్నారు బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి. టిటిడి లడ్డూలో కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణలకు వైసీపీ ధీటుగా స్పందిస్తోంది. ప్రత్యర్ధి పార్టీని దెబ్బ తీయడానికి చంద్రబాబు పూనుకున్నారని ఆరోపిస్తున్న టిటిడి బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్.డి.డి.బి ఫేక్ రిపోర్ట్‌తో జాతీయ మీడియాలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన తప్పును సవరించుకోకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. జూలై 17న టిటిడి ఈవో శ్యామలరావు చాలా స్పష్టంగా ఏడిబుల్ ఆయిల్ ఉందని స్పష్టంగా చెప్పారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టిటిడి ప్రతిష్ఠను దిగజార్చడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందన్నారు. ఈ వ్యవహారంపై అధికారులెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన భూమన.. మీరెందుకు మాట్లాడుతున్నారన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. హిందూ జాతినంతా అవమానిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ఘటనతో చంద్రబాబు అసలు విష స్వరూపం బయట పడిందని, తమపై వచ్చిన అపవాదుకు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. హిందూజాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. ఇలాంటి ఆరోపణలతో వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకు దెబ్బ తగులుతుందన్న బాధతో ఉన్నామన్నారు. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో కుయుక్తులు, కుట్రలు చేశారని వెంకటేశ్వరస్వామిని వాడుకుని జగన్ మోహన్ రెడ్డిపై చేసిన ప్రయత్నం వికటించిందన్నారు టిటిడి బోర్డు మాజీ చైర్మన్ భూమన.

ఇక తిరుమల లడ్డూ, కల్తీ నెయ్యిపై టిటిడి బోర్డు మాజీ చైర్మన్ వైవీ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రమాణం ఛాలెంజ్‌కు నారా లోకేష్ రెడీ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న నారా లోకేష్.. తిరుపతి విమానాశ్రయంలో వైవి సుబ్బారెడ్డికి ఛాలెంజ్ విసిరారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. వైసీపీ హయంలో టిటిడిలో జరిగిన అవినీతిపై స్పష్టమైన ఆరోపణలు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం దేవుడికి భక్తులను దూరం చేసిందన్నారు. అన్నదానం, లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేకుండా చేశారని ఆరోపించారు. ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పామని.. అయినా వినలేదన్నారు లోకేష్. శ్రీవారి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును వినియోగించినట్లు ఆధారాలున్నాయన్నారు. ల్యాబ్ రిపోర్ట్‌తో జంతువుల కొవ్వును వాడినట్లు ఆధారాలు బయట పెట్టామన్నారు. టిటిడిలో ధర్మారెడ్డి ఈఓగా వచ్చాకే నెయ్యి గోల్‌మాల్ జరిగిందన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తిపడి.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు లోకేష్. ఢిల్లీకి చెందిన ఆల్ఫా కంపెనీ ద్వారా బటర్ ఆయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని లోకేష్ అన్నారు. టీటీడీలో ప్రక్షాళన మొదలైందని పవిత్రతను కాపాడుతామన్నారు. కల్తీ నెయ్యికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమని.. నెయ్యి కొనుగోలు అక్రమాల్లో తీసుకున్న కమిషన్లను కూడా రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తామన్నారు లోకేష్. తిరుమలలో ప్రమాణం చేస్తామన్న వైవీ సుబ్బారెడ్డికి సవాల్ విసురుతున్నామన్నారు. తాను ఇక్కడే ఉన్నానని.. దమ్ముంటే వైవీ సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు లోకేష్.

పింక్ డైమండ్‌ను రాజకీయంగా చేశారని వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు రెడ్ బుక్‌కు భయపడుతున్నారన్నారు లోకేష్. ఇలా తిరుమల లడ్డూలోని నెయ్యి పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోగా.. ఇప్పటిదాకా టీటీడీ ఉన్నతాధికారులెవరూ ఈ వ్యవహారంపై స్పందించడంలేదు. భక్తుల్లో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇవ్వకపోగా శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాత్రం శుక్రవారం మీడియా ముందుకు రాబోతున్నారు. ఏం మాట్లాడబోతారన్నదే సస్పెన్స్‌గా మారింది. తిరుమల శ్రీవారి ప్రసాదాలకు, నైవేద్యాలకు వాడుతున్న నెయ్యిపై రమణ దీక్షితులు ఎలాంటి హాట్ కామెంట్స్ చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు