తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదిన బాలాలయ పనులు ప్రారంభిస్తామని, 6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని వివరించారు.
బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో మార్పులు ఉండవని అన్నారు. భక్తులు సమర్పించిన బంగారంతోనే తాపడం పనులు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 2 నుంచి 11వ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. గత ఏడాది తరహాలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుందని చెప్పారు.
రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రారంభిస్తామని అన్నారు. నందకం అతిథి గృహంలో రూ.2.95 కోట్లతో ఆధునాతనమైన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఘాట్ రోడ్డులో 9 కోట్ల రూపాయల వ్యయంతో క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. బాలాజీనగర్ లో 3 కోట్ల రూపాయల వ్యయంతో స్థానికుల నివాసాలకు మరమ్మతులు చేపడతామన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ… ‘‘వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు భక్తులకీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు ముందుగానే జారీ చేస్తాం. సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో ప్రతి నిత్యం 50 వేల టిక్కెట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ప్రతి నిత్యం 25 వేల టిక్కెట్లను ఆన్ లైన్ లో విధానంలో కేటాయిస్తాం.
పది రోజులు పాటు టిక్కెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తాం. దర్శన టిక్కెట్టు లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ.. వారిని దర్శనానికి అనుమతించే అవకాశం ఉండదు. లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అవకతవకలు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఏడుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులపై కేసులు నమోదు చేశాం. నెల రోజులుగా లడ్డూ కౌంటర్లో నిఘా వ్యవస్థను పటిష్ఠ పర్చడంతో.. కాంట్రాక్ట్ ఉద్యోగులు కుట్రకు పాల్పడుతున్నారన్న ముందస్తు సమాచారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం’’ అని వివరించారు.