తెలంగాణలో ఇటీవల గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక లెటర్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా వీటిని అందజేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు..
రేవంత్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాకు పిలుపునిచ్చింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా ఈ విజయోత్సవాలు జరగనున్నాయి. అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లో వీటిని జరిపేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన టీజీజీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాల్లో ఉద్యోగాలు సంపాదించిన వారికి సీఎం రేవంత్ తీపి కబురు చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 4న పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపనున్నారు. అదే వేదికగా గ్రూప్ 4తో పాటు, వివిధ నియామకాల ద్వారా ఎంపికైన దాదాపు 9 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సచివాలయంలో శనివారం సాయంత్రం ‘ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు’పై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ..
వరంగల్లో నవంబర్ 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందన్నారు. నవంబర్ 30న మహబూబ్నగర్లో రైతు సదస్సు ఏర్పాటు చేయాలన్నారు. అంతకంటే ముందు 28, 29 తేదీల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. డిసెంబరు 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని, పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. తమ శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల జాబితాతోపాటు భవిష్యత్ ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని వివరించాలి.
డిసెంబరు 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా తార స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు. డిసెంబరు 9న సచివాలయం ముఖద్వారం ఎదుట ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ఆవిష్కరణ. అదే రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని సూచించారు. ఉత్సవాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అని సీఎం రేవంత్ ఆయా శాఖల మంత్రులను, అధికారులను ఆదేశించారు.