తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈవీ వాహనాలు పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నేటి నుంచి నూతన పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తగా ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేసే వారికి లబ్ది చేకూరనుంది..
వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రజల్లో ఈవీ వాహనాలపై అవగాహన పెరిగేలా పలు రకాల ప్రోత్సహకాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి సూపర్ న్యూస్ చెప్పింది. ఈవీ వాహనాలకు రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ ఫీజును 100 శాతం మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ‘ఈవీ నూతన పాలసీ’ని రూపొందించారు. ఈ సరికొత్త విధానం ఈరోజు (సోమవారం) నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ కంపెనీ వాహనం కొనుగోలు చేసినా సరే కానీ విద్యుత్‌తో నడిచేదే కొనండని, భవిష్యత్ తరాల్ని కాలుష్యం నుంచి రక్షించండని మంత్రి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కేవలం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించిందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన నూత విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్లు మంత్రి తెలిపారు.
2026 డిసెంబర్ 31వ తేదీ వరకు రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యే అన్ని ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఇది వర్తిస్తుందని మంత్రి తెలిపారు. అవసరమైతే ఈ గడువును పొడిగించే అంశంపై ఆలోచిస్తామని తెలిపారు. దీనిద్వారా ప్రభుత్వం ఏటా రూ. వందల కోట్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని మంత్రి అన్నారు. టూవీలర్, , కార్లు, ఆటోలు, ఆర్టీసీతోపాటు ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక ఈ కొత్త పాలసీకి సంబంధించి జీవో 41ని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదివారం జారీ చేశారు. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తునట్లు జీవోలో పేర్కొన్నారు.