మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్టగా పిలవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం… స్వామివారి సన్నిధిలో పాత ఆచారాలను అమలు చేయబోతోందా…? ఇప్పటికే ఆలయంలో పలు మార్పులు చేసిన రేవంత్ సర్కార్…? ఇంకేమైనా మార్పులు చేయాలని చూస్తోందా…? అసలు యాదగిరిగుట్టపై ప్రభుత్వ ఆలోచనేంటి…?
తెలంగాణ ప్రజల ఇలవేల్పు. భక్తుల కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహ స్వామి.. ప్రజల చేత యాదగిరి నర్సన్నగా విరాజిల్లుతున్నాడు. అయితే.. గొప్ప చరిత్ర ఉన్న యాదగిరిగుట్టను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… అప్పటి సీఎం కేసీఆర్ 1200 కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునర్ నిర్మించారు. యావత్ దేశం అబ్బురపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2016 నుంచి ఐదేళ్ల పాటు శ్రమించి యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా మార్చారు. అంతేకాదు… యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మారుస్తూ… భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక ప్రధానాలయం పునర్నిర్మాణానికి ముందు వరకు ఉన్న ఆచారాలను అప్పట్లో తొలగించారు. భక్తులు కొండపై బస చేయడం, కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో స్నానం చేసి మొక్కులు తీర్చుకోవడం వంటి సాంప్రదాయాల్ని తొలగించారు. అంతేకాదు గుట్టపై పలు వాహనాల రాకపోకలపైనా పలు ఆంక్షలు విధించారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఆలయం అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పాత ఆచార, సంప్రదాయాలను మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యాదాద్రిని యాదగిరిగుట్టగా పిలవాలన్న రేవంత్ సర్కార్… ఆలయంలో మరిన్ని మార్పుల చేర్పులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే భక్తులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేసింది. ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. స్వామి సన్నిధిలో భక్తులు బస చేసే విధంగా డార్మెంటరీ హాల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కొబ్బరి కాయలు కొట్టడం, కొండపైకి ఆటోలు వెళ్లడం వంటి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. అంతేకాదు స్వామివారి క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు… ఇటీవలే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించారు. అలాగే ఏళ్లుగా వస్తున్న గిరిప్రదక్షిణ సంప్రదాయాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఇక తాజాగా ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానానికి అనుమతించారు. ఇక కొండపై పాత ఆచార సాంప్రదాయాలను పునరుద్ధరించడం పట్ల భక్తులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ప్రభుత్వాలు మారడంతో… యాదగిరిగుట్టపై ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల సౌకర్యాల కల్పనలోనూ మార్పులొస్తున్నాయి. ఇక ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… భక్తుల సౌకర్యార్ధం మరికొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి… ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..!