తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) ఏర్పాటు చేశామని TDCA ఛైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాల్లో క్రికెట్ మౌళిక సదుపాయాలు లేవు. దీంతో ప్రతిభావంతులైన తెలంగాణ గ్రామీణ క్రికెటర్లు కనీసం రాష్ర్ట స్థాయి పోటీలకు సైతం దూరమయ్యే స్థితిలో ఉన్నారంటూ తెలిపాడు.
నా హయాంలోనే తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, ఇషా సింగ్, ఆకుల శ్రీజ, హుస్సాముద్దీన్, వ్రితి అగర్వాల్ వంటి ఛాంపియన్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని ఆయన ఉద్ఘాటించారు.
అదే తరహాలో క్రికెట్‌లోనూ తెలంగాణ నుంచి ఛాంపియన్లను తయారు చేసేందుకు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోయేషన్‌ను ఆవిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
అందరి సహకారంతో త్వరలోనే బీసీసీఐ గుర్తింపు సాధించేందుకు ముందుకు సాగుతామని వేంకటేశ్వర రెడ్డి తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ రమణ చారి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితోపాటు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.