సైబర్ మోసాలు ఆగడం లేదు. రోజుకు ఒక పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వాట్సాప్ కాల్ చేసి ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. ముంబై నుంచి ఇరాన్‌కు వెళ్తున్న పార్శిల్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన పార్శిల్స్ దొరికాయని.. అందులో ఎండిఎంఏ డ్రగ్స్ ఉన్నాయని బాధితులను భయాందోళనకు గురి చేశారు. మీ పేరుతో ఆ డ్రగ్స్ పార్శిల్‌లు ఇరాన్ వెళుతున్నాయని.. ఆధార్ కార్డుతో పాటు అడ్రస్‌ను పెట్టి భయపెట్టారు. ఇక ఈ కేసు నుంచి బయట పడాలంటే మూడు దశలలో వారికి మెసేజ్ చేయాలని అప్పుడే ఈ కేసు నుంచి బయట పడతారంటూ బెదిరించారు. ఆ విధంగా రూ. 5.9 లక్షలు కొల్లగొట్టారు. కాసేపటి తర్వాత సదరు బాధితుడు ఇది మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించాడు.
మరోవైపు ప్రైవేట్ ఉద్యోగికి గూగుల్‌లో ఒక ప్రకటన కనిపించింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని భావించి ఆ లింకును ఓపెన్ చేశాడు. ఆ తర్వాత డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేశాడు. బాధితుడిని ఓ స్టాక్ సర్వీస్ గ్రూప్‌లో యాడ్ చేశారు నేరస్తులు. అనంతరం బాధితుడి చేత పెట్టుబడులను పెట్టించారు. ప్రారంభంలో మంచి లాభాలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మెల్లగా ఊబిలోకి దించారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టిన తర్వాత.. తిరిగి తీసుకునే ఆప్షన్ క్లోజ్ చేయడంతో రూ. 13.07 లక్షలు నేరస్తులు తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విధంగా ఒకవైపు స్టాక్ మార్కెట్.. మరోవైపు నార్కోటిక్ పోలీసులమంటూ సుమారు రూ. 20 లక్షల రూపాయలను కొల్లగొట్టారు సైబర్ నేరస్తులు.