మీరు కింది ఫోటో చూసి ఏదో పాడుబడిన ఇంటిలో ఎలుకలు తిరుతున్నాయని అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే..ఆది ఓ పేరు మోసిన హాస్పిటల్.. అసలు ఏం జరిగిందంటే..!
దాని చూసినవాళ్లు ఎవరైనా హాస్పిటల్ అనుకోరు.. ఏదో పాడుబడిన ఇంటిలో ఎలుకలు తిరుతున్నాయని అని అనుకుంటారు. అది కూడా హైదరాబాద్ నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఉస్మానియా హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు అస్సలు నమ్మలేరు. కానీ అదే నిజం..
ఎంతో మంది ఎన్నో రోగాల పాలై మంచి చికిత్స దొరుకుతుంది కదా అని ఉస్మానియా హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. అక్కడికి వస్తే రోగం సంగతి దేవుడెరుగు.. కొత్త రోగాలు రాకుండా ఉంటే అదే చాలు అంటున్నారు ఇది చూసిన ప్రజలు.. రోగులకు తోడుగా ఉండేందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ఎలుకల మధ్యే కాపురం చేయాల్సిన పరిస్థితి ఉంది. వార్డుల్లోనూ, రోగి బంధువులు సేద తీరే చోట్లలో ఎలుకలు తమ ఇష్టారాజ్యం అన్నట్లు తిరిగేస్తున్నాయ్. ఇంత తతంగం జరుగుతున్నా మరి ఆస్పత్రి సిబ్బంది, అధికారులు ఏం చేస్తున్నారంటే అందుకు ఎవరి దగ్గర సమాధానం లేదు.
పేరుకే నగరం.. అందులో పేరున్న ఆస్పత్రిలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక మామూలు ఆస్పత్రుల సంగతి ఏంటనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. రోగం నయం చేసుకోవాలని ఆస్పత్రికి వస్తే.. కొత్త రోగాలు వస్తే మాకు దిక్కు ఎవరు అంటూ రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆస్పత్రి నిర్వాహకులు, సిబ్బంది ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.