భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఇవాళ (అక్టోబర్ 15) వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, నావీ రంగంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకి అనువైన ప్రాంతం సముద్ర తీరం. ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు కాబోతుండటంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అటవీ సంపద అంతరించిపోయి, మూసీ నది మనుగడ ప్రశ్నార్థకం కానుందని విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా..? మూసీ అంతర్ధానం అవుతుందన్న వాదనలో నిజమెంత? అన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. నేవీ రాడార్ స్టేషన్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మూసీ నది కోసం ముఖ్యమంత్రి కరువు శాసనం రాస్తుండగా, మరోవైపు సుందరీకరణ ప్రాజెక్ట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. పదేళ్లుగా తమపై ఒత్తిడి తెచ్చిన రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము అనుమతిని నిరాకరించామని ఆయన పేర్కొన్నారు.
ఇది చూడగానే ముఖ్యమంత్రి కార్యాలయం ధీటుగా స్పందించింది. సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఈ ప్రాజెక్ట్‌కు తుది ఆమోదం తెలిపిందని గుర్తుచేసింది. 1980 అటవీ సంరక్షణ చట్టం సెక్షన్-2 ప్రకారం, విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆమోదం ఇచ్చింది అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతంలో బీఆర్ఎస్ అనుమతినిచ్చిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తుండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.దేశ భద్రతకు సంబంధించి ప్రాజెక్టులను వ్యతిరేకించడం, రాజకీయ ప్రేరేపింతంగా వ్యవహరించడం కేటీఆర్ అసలు స్వరూపాన్ని చూపిస్తుంది అని పేర్కొంది.
విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను నిర్మించాలని భావించింది. ఇందుకు 2017 మార్చి 2న నేవీ విభాగం రాష్ట్ర అటవీ శాఖకు రూ.133.54 కోట్లు జమచేసినట్లు, 2017 డిసెంబర్ 19న జీవో నెం.44 ద్వారా నేవీకి అటవీ భూములను బదిలీ చేశారని సీఎంఓ వెల్లడించింది. వీఎల్ఎఫ్ అంటే వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ అంటారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకుంటారు.
అయితే, రాడార్ స్టేషన్‌కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఈ నెల 15న శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా దామగుండంలోని అటవీ ప్రాంతం మొత్తం 3 వేల 260 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 2900 ఎకరాలను నేవీకి అప్పగించారు. ఆ భూముల్లో లక్షా 93 వేల చెట్లున్నట్లు గుర్తించారు. మరో 300 నుంచి 400 ఎకరాల్లో గడ్డి భూములున్నాయి. నేవీకి అప్పగించిన భూముల్లోని చెట్లను పూర్తిగా తొలగించబోమని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తొలగించాల్సిన చెట్లను వేళ్లతో సహా పెకిలించి గడ్డిభూముల్లో నాటాలని అటవీ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తీసుకురాబోతోందో చూడాలి!