ఒలింపిక్స్ 2024 ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఒలింపిక్స్‌లో 10,500 మందికిపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ అథ్లెట్లు తమ దేశం కోసం పతకాలు సాధించడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పతకం గెలిచిన తర్వాత ఓ దేశానికి చెందిన ఓ క్రీడాకారుడు తన సంతోషం కొద్ది క్షణాల్లోనే బాధను మిగుల్చుకున్నాడు.
ఈ అథ్లెట్ మోల్డోవాకు చెందిన ఆదిల్ ఉస్మానోవ్. అతను తన జూడో కెరీర్‌లో అత్యంత కీలకమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.
24 ఏళ్ల ఒస్మానోవ్, పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్‌లో 73 కిలోల జూడో వెయిట్ విభాగంలో ఇటలీకి చెందిన మాన్యుయెల్ లాంబార్డోను ఓడించి కాంస్య పతకాన్ని జులై 29, సోమవారంనాడు గెలుచుకున్నాడు. అయితే, ఒక ప్రమాదం అతని ఈ విజయాన్ని బాధగా మిగిల్చింది. మ్యాచ్ స్కోర్ ప్రకటించిన కొద్ది సెకన్ల తర్వాత, ఉస్మానోవ్ గెలుపొందడంతో సెలబ్రేట్ చేసుకోవడానికి చేతులు పైకెత్తడం ప్రారంభించాడు. నివేదికల మేరకు అతని ఈ సెలబ్రేషన్స్‌లో చిన్న పొరపాటు జరిగింది. తన చేతిని అటు, ఇటు తిప్పుతున్న సమయంలో.. తన భుజం పట్టేసింది. దీంతో చాలా బాధతో కనిపించాడు.