జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్
సీనియర్ ఆటగాళ్లు దూరం
హైదరాబాద్ ఆటగాళ్లకు చోటు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మకు జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో జింబాబ్వేతో జరిగే ఐదు టీ20ల సిరీస్ ద్వారా నితీష్, అభిషేక్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం కుర్రాళ్లకు ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2024లో సత్తాచాటిన ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ సహా ఐపీఎల్ 2024 లో మెరుగైన ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్‌లకు సైతం భారత జట్టులో చోటు దక్కనుందని తెలుస్తోంది. వీరందరిని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కు రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నారట.
ఐపీఎల్ 2024లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రెడ్డి.. 33.67 సగటు, 142.92 స్ట్రైక్‌రేట్‌తో 303 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీ (76 నాటౌట్)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసాడు. మరోవైపు అభిషేక్ శర్మ 13 మ్యాచ్‌ల్లో 38.92 సగటు, 209.41 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (41) కొట్టాడు.