అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు

అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికిన ఓ వ్యక్తికి తెలంగాణ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ అడవిని సృష్టించాలని తీర్పునిచ్చింది. పచ్చదనం కోసం 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.
ప్రధానాంశాలు:
అటవీ భూమిని నరికేసిన వ్యక్తి
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
200 మెుక్కలు నాటాలని ఆదేశం

పర్యావరణ పరిరక్షణకు, మెుక్కల పెంపకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రకృతిని కాపాడుకోవటం కోసం అడువులను సంరక్షించటంతో పాటు హరితహరం వంటి కార్యక్రమాలతో కొత్తగా మెుక్కలు నాటేందుకు ప్రభుత్వం పాటుపడుతోంది. అయితే కొందరు తమ స్వార్థం కోసం చెట్లను నరికేస్తున్నారు. తాజాగా.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అడవీలోని చెట్లను నరికేసి వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిపై కేసు పెట్టడంతో పాటు ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. చెట్లను నరకటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎక్కడ చెట్లను నరికారో అక్కడ 200 చెట్లు నాటాలని తీర్పు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జిల్లెడ మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లేశ్‌ అనే వ్యక్తి మరో ఇద్దరు కలిసి.. కుష్నేపల్లి రేంజ్‌ లింగాల సెక్షన్‌ గైరెల్లి ఆర్‌ఎఫ్‌ బ్లాక్‌లోని ఫారెస్ట్ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దాదాపు రెండెకరాల్లో చెట్లు నరికేశారు. దీంతో అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అనంతరం మల్లేశ్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అప్పగించగా.. ట్రాక్టర్‌ను వారు సీజ్ చేశారు.

దీంతో తన ట్రాక్టర్‌ విడిపించుకోవటం కోసం మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అడవులను ఆక్రమించాలని ప్రయత్నిస్తున్న వారు, భారీ ప్రాజెక్టుల వల్ల అటవీ భూముల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోందన్నారు. అడవుల పరిరక్షణపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఇప్పటి నుంచి అడవులను నరికితే.. అంతేస్థాయిలో అడవి పెరిగేలా మొక్కలు నాటాల్సి ఉంటుందన్నారు.

ఈ మేరకు రెండు ఎకరాలకు సరిపోయేలా ఎకరానికి 100 మెుక్కల చొప్పున 200 మొక్కలు నాటాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అడవిని నాశనం చేస్తే ఇక నుంచి ఊరుకునేది లేదన్నారు. పిటిషనర్ నాటాల్సిన మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సూర్యా పేట డీఎఫ్‌ఓను న్యాయమూర్తి ఆదేశించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు