సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలో హైదరాబాద్ సిటీలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన 360 కేజీల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాదినం చేసుకున్నామని చెప్పారు. వాహనాల్లో గంజాయిని తరలిస్తూ ముందు ఒక పైలెట్ వాహనంతో వెళ్లారని చెప్పారు. డ్రగ్స్, గంజాయిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరు డ్రగ్స్, గంజాయి సప్లే చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.