ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమయితే.. నియామక పత్రాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి అని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
కొత్తగూడెం ఇల్లందులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్న వాళ్లకు పట్టం కడితే ప్రశ్నించే గొంతుకైతారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌కు బద్ది చెప్పాలంటే, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని తెలిపారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో టెట్‌కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేశారు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు.
ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ కృషి చేసింది. సోషల్ మీడియాలో మాపై వ్యతిరేక ప్రచారం వల్లే మా అభివృద్ధి ప్రచారంలోకి రాలేకపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ నరేంద్ర మోీదీ తలుపులు తెరుచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 56 కేసులు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆలోచించి పట్టబద్రులు ఓటు వేయాలి’ అని కోరారు.