రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని పేర్కొన్నారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అవతరించనుందని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని విమర్శించారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారు.. ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా ఏ గ్యారంటీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించట్లేదని ధ్వజమెత్తారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.