ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాలలో పాత కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్‌ లీడర్‌ను అని జీవన్‌ రెడ్డి అంటుంటే.. గతంలో జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి కేరాఫ్‌ అడ్రస్సే తన ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్.. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాలలో పాత కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫైర్ అవుతున్నారు. తనకు తెలియకుండా ఆయనను పార్టీలో చేర్చుకున్నారని ఇప్పటికే అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్సీ మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. శాసనసభలో సంఖ్యను పెంచుకోవడం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సరికాదంటూ పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే.. గురువారం కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి గెలిపించినా ఫిరాయింపుల అవసరం ఏముందన్నారు. 10మంది ఎమ్మెల్యేలు వచ్చి తమపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంపగుత్తగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారన్నారు. నైతికవిలువలను కాపాడేలా పార్టీ పనిచేయాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను పోరాడటం లేదని.. కాంగ్రెస్‌ విధానాలను మాత్రమే గుర్తుచేస్తున్నట్టు జీవన్‌ రెడ్డి తెలిపారు. లోసుగులను వాడుకుని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. క్రమశిక్షణతో ఉన్న తమకు అన్యాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

అయితే.. బుధవారం కూడా జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజయ్‌ చేరిక స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలను గాయపరిచిందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఒరిజనల్ కాంగ్రెస్సో ఎవరు బీఆర్ఎస్ కాంగ్రెస్సో తెలియడం లేదన్నారు.

జీవన్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాను జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానన్నారు. తన కుటుంబానికి మొదటి నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందన్నారు. తాతల కాలం నుంచి కాంగ్రెస్‌ అంటే తనకు అభిమానం ఉందన్నారు సంజయ్‌ కుమార్.

కాగా.. జీవన్ రెడ్డి-సంజయ్‌ కుమార్ వివాదంపై ఇప్పటికే.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి ఆవేదనను తాను అర్థం చేసుకున్నానన్నారు. కొత్త నేతలు పాత నేతలను కలుపుకుని పోవాలన్నారు. ఇద్దరి మధ్య గొడవ త్వరలోనే సద్దుమణుగుతుందంటూ పేర్కొన్నారు.. ఈక్రమంలోనే జీవన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు