యాపిల్ పండు ఆరోగ్యాన్ని కాపాడటంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతారు వైద్యనిపుణులు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. రోజూ ఒక గుడ్డు లాగా రోజుకో ఆపిల్ తింటే సంపూర్ణ ఆరోగ్యం పక్కా అంటూ ఉంటారు డాక్టర్లు. అయితే షుగర్ ఉన్న వారు యాపిల్ తినకూడదని చెబుతారు. కానీ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో దివ్యౌషధంగా యాపిల్ పనిచేస్తుంది.
అయితే, తాజాగా వెలువడిన సర్వే వివరాల ప్రకారం ఒక్క యాపిల్ లో కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి ఈ బ్యాక్టీరియా మనకు మంచి చేస్తుందా, చెడును కలుగజేస్తుందా అన్నది ఆసక్తిని కలిగించే విషయం. ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనలో 40గ్రాముల బరువున్న ఒక ఆపిల్‌లో సుమారు 10కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు నిపుణులు. సాధారణంగా మనం యాపిల్ లో తొక్క, కాడ, విత్తనాలు ఇలా అన్నింటినీ తీసేసి తింటూ ఉంటాము. అలా చేయడం వల్ల చాలా బ్యాక్టీరియాను నష్టపోతామంటున్నారు పరిశోధకులు. ఇదంతా మంచి బ్యాక్టీరియా అని, శరీరంలో చెడు బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యకరంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు.