ఇరాక్‌లో ఆదివారం (డిసెంబర్ 18) ఘోర మారణహోమం సంభవించింది. ఐఎస్ ఉగ్రమూక ఇరాక్ పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది పోలీసధికారులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కిర్కుక్ సమీపంలోని సఫ్రా గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జిహాదీలు ప్రత్యక్ష దాడికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో జరిగిన ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. తొలుత పోలీసు పెట్రోలింగ్‌పై ఐఎస్ ఫైటర్లు పేలుడు పరికరాన్ని పేల్చారు. ఆ తర్వాత మెషిన్ గన్లు, హ్యాండ్ గ్రెనేడ్లతో వారిపై దాడి చేసినట్లు గ్రూప్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఓ ప్రకటన ద్వారా వెలువరించారు. ఈ దాడిలో ఒక ఐఎస్ ఏజెంట్‌ను మట్టుబెట్టినట్లు, మిగిలిన వారికోసం గాలిస్తు్న్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్-సుదానీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘పిరికి ఉగ్రవాద దాడి’గా వ్యాఖ్యానించారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులను జాగ్రత్తగా గస్తీ కాయాలని, తీవ్రవాదులకు ఎలాంటి అవకాశం కల్పించకూడదని ఆయన సూచనలు జారీ చేశారు. దాడికి పాల్పడ్డ ఉగ్రమూకపై చర్యలకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.